Discussion of the poem starts at 56:35
నాన్నల్ని కొనాలి, కిలో ఎంత?
రొట్టెలకు రేటుంది
చూపులకి చులకనవతూ గాలికి ఎగిరే
మా బట్టలకీ రేటూంది
నాన్నలు కావాలి, కిలో ఎంత?
అమ్మ ఒంటి మీద కదుము కట్టిన
గాయాల్లో నాన్న చేసింది ఎన్నో గాయమయినా
గాయాల మీద రేపు వాలబోయే ఈగల్లో
నాన్న ఉనికి ఎన్నో క్రిమి అయినా
నమ్మి నమ్మి నమ్మకాలన్నీ వట్టిపోయిన
మా వాడకి నాన్న తనం ఎన్నో అబధ్ధమేనా?
బడికెళ్ళి కాసిన్ని అక్షరాలు నేర్చుకునేందుకు
నాన్నల్ని చూపాలి, కిలో ఎంత?
చెట్టంతటి మా అమ్మని కొమ్మలు రాల్చి
వట్టి కట్టెలా మంచాల మీద చీలుస్తున్నప్పుడు
తలుపుకివతల నిస్త్రాణగా దొర్లిన నా బాల్యానికి
ఎవరో మప్పిన నల్లమందు రుచి నాన్న ఇచ్చింది కాదు
ఒడ్డున పడేసిన ఓటి పడవలా
పొద్దంతా నిద్దరోయే అమ్మ డొక్కలో తలదూర్చి
రాత్రవకూడదని నే చేసే ప్రార్థనకి నాన్న పీడ పోదు
పదేళ్ళకే పయట జార్చి కన్ను కొట్టడం
నేర్పిన మా ఆకలకీ నాన్న రాజముద్ర అక్కరలేదు
బడికెళ్ళి నాలుగు అంకెలు నేర్చుకునేందుకు
నాన్నల్ని తేవాలి, కిలో ఎంత?
తన్నుకుంటూ తార్చుకుంటూ ఈ దందాలో
చేర్చిన వాళ్ళలోనూ
దందాలో ఉన్నందుకు జైల్లో కుమ్మి
జరిమానాలు దండుకుంటున్న వాళ్ళళ్ళోనూ
ఎక్కడో ఓచోట
కలుగుల్లోనో పుట్టల్లోనో గుహల్లోనో
నాన్నలుండే ఉంటారు
మర్యాదస్తులంతా వాళ్ళ నాన్నలకే పుడతారట
మేం అమ్మ కడుపున పుడతాం
బడికెళ్ళి దోసిడి గునకరాళ్ళు వల్లించాలంటే
నాన్నల్ని కొనాలి, కిలో ఎంత?
నాన్నంటేనే చీకటిభూతాల గుంపయిన చోట
నాన్నలంటేనే పుట్టని మా చెల్లెళ్ళకు కూడా రోజువారీ
కస్టమర్లవుతున్న చోట
వండుకున్న అన్నాన్ని తన్నుకుపోయే
గజ్జి కుక్కల్ని తరిమినట్టు
కళ్ళ నిండా తోడుకున్న మా నిద్రల్ని
తన్నుకుపోయే నాన్నల్ని తరమలేక
ఏ జంతువు పేరెట్టి తిట్టుకుంటే
ఆ జంతువు సిగ్గుతో చిమిడిపోతున్న చోట
బడికెళ్ళి పిడికెడు గుణింతాలు నేర్చుకోవాలంటే
నాన్నలు దిగిరావాలి, కిలో ఎంత?
కిటకిటలాడే మీ స్కూలు రిజిస్టరులో
రాముడనో రహీమనో కరుణామయుడనో
దేవుడి అవతారాలు తగిలించుకున్న తండ్రుల్లో
మా దగ్గర కొమ్ములూ కోరలూ విసిరే
భూతం నవ్వుల నాన్నలెవరో
రాయగలిగితే రాసుకోండి
బతుకు నీడల్లాంటి నల్లటి బడి పలకల మీద
మా ఉమ్మితో తుడిసి పవిత్రం చేశాక
నరనరాల్లా విరిగిపోయిన విషరక్తపు బింధువు పేరు
నీచుడనో మారీచుడనో ఖడ్గమృగమనో క్రిమికీటకమనో
అలవాటుగా ఆనవాయితీగా అక్షర దోశాలు లేకుండా రాసుకోండి